(అనంత పధ్మనాభస్వామి ఆలయం, తిరువనంతపురం, కేరళ)
ఉదయం సుమారు మూడున్నర కావస్తుంది… చవిచీకటి పరిచిన నిశ్శబ్ధం సాక్షిగా సూర్యడు నిద్రిస్తున్న సమయమది. ఒకరిద్దరు తప్ప వీధి లో ఎవరు లేరు. గుడి వీధి చివర దింపిన టాక్సీవానికి నా స్తోమతకి తగిన టిప్ ఇచ్చి కిందకి దిగాను. పాత సినిమాల్లొ సంప్రదాయం ఉట్టిపడే గుడి వీధి లా వుంది. మొదటి సారి, ఆపైన ఇష్టమున్నా అలవాటు లేని పంచ, ఉత్సుకత వున్నా తెలియని పరిసరాలు. ఎమైనా అపచార దొషం చెస్తున్నానేమోనన్న అలజడి ఉన్నా ప్రశాంతంగా వున్న కొలను ఆసరాగా తీసుకుని గుడి మెట్లు ఎక్కడం మొదలుపెట్టాను.
కేవలం సంప్రదాయ దుస్తులు మాత్రమే లోనికి అనుమతిస్తారు కనుక పండుగ వాతావరణం గుడి గుమ్మం దగ్గరే మొదలవుతుంది. అసలే కేరళ వారు, అందునా ఆడవారు. కుంకుడుకాయలు వాడే రోజుల్లో చూసినంత నల్లని కురులు, కూసింత తడి వుండగానే వాటిని వెనుకకి కట్టే కేరళ తీరు, ఆ తడి నుంచి ఊపిరి కోసం ఎదురుచూసే ఒకటి రొండు పువ్వులు, చందనపు బొట్టు, తొలిజాము వెలుతురులో మెరిసే వారి ముఖవర్చస్సు, పలుచని గోధుమ రంగు చీరకి ఆ బంగారపు అంచు ఇచ్చే శోభ.. అబ్బ.! భారతీయత వద్దన్నా ఉట్టిపడుతుంది. మగవారు ‘ముండు’ అనే పంచ మాత్రమే ధరించాలి, అయినా స్త్రీలకు ఏ మాత్రం తీసిపోలేదు. నూనూగు మీసాల దగ్గర నుంచి పాల తెలుపు గడ్డాల వరకు ప్రతి ఒక్కరూ ఆ పంచలో వెలిగిపోతున్నారు. మన పూర్వికులు ఇంత అందంగా బ్రతికే వారా? వస్త్రాభరణం లోనే వాళ్లు ఇంత గొప్పదనం అనుభవించేవారా అనిపిస్తుంది.
గుడిలోపల ఎటు చూసినా వేలాడుతున్న సంప్రదాయమైన కుందులు (తూకు విళక్కు అంటారు) . ఎవరో చెప్పినట్టు, ఎంత వెలుగు ఇస్తే ఆ గుడి అందం హెచ్చింపబడుతుందో తెలుసుకుని అంతే వెలుగు ఇస్తున్నట్టు న్నాయి. ప్రదక్షిణలు, మలుపుల నడుమ కానవచ్చే గణాధిపతి, ఆ పక్కనే వున్న గర్భగుడి, కొన్ని అడుగులకే ఎదురొచ్చే విగ్రహమూర్తి గురించి రాయడం మానవ మాతృనికి చెల్లదు. జల, ఫల, పూల సమక్షంగా అలంకరించిన ఆ రూపం శాంతం, వయనం ప్రశస్తం, వెలుగు అనంతం. జగములన్ని ఏలే ఆ శాంతాకారుడి ముఖమున మనము కానవచ్చిన సంతొషం లొ సన్నటి చిరునవ్వు, అతి పవిత్రమైన తులసాకులతో చేసిన దండలు, వాటినుంచి వచ్చే సన్నని సువాసన తెరలు, వాటికి ధీటుగా కర్పూరధూపాలు, ఇంతలో మేమంటే మేము అని పిలిచే గులాబీ, జాజి, మల్లెలు. అష్టైశ్వర్యా లు గా మారిన దిక్పాలకులు, నాలుగు స్తంభాలై గోపురం మోస్తున్న దిక్కులు, సమయం సంధర్భం గా మారిన నింగీనేల ద్వయాలు, అన్నీ ఒక్కటై ఆ స్వామిని కొలిచె తీరు చూడటానికి మన కళ్లు సరిపోవు. జీవకోటికి కారణమైన సూర్య భగవానుడి చెంతలేకున్నా అఖంద భూమండలం వెలిగిపొవడానికి కారణం ఇదేనెమొ అనిపిస్తుంది. అంతగా వెలిగి పోతుంది ఆ గర్భగుడి.
వేదమంత్రాలు చదువుతున్న పండితులు, ఆ గుడి గొడల వరకు వెళ్లి తమ స్వామిని విడువలేక తిరిగి వచ్చేస్తున్న ప్రతిధ్వనులు, ఐహిక వాంఛలు ఆరిషడ్వర్గాలను జయించి తమ ఇలవేల్పు సేవలో తన్మయత్వం పొందుతున్న ఆ పుణ్యాత్ములని చూసి తరించ గలమే కాని, వర్ణించాలనుకోవడం హాస్యాస్పదం అవుతుంది. ఇంతలో… సౌమ్యం గా నిశబ్దంగా భక్తులను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్న పంచ కట్టిన పోలీసులు, వారికి తెలిసిన రీతిలో సుప్రభాతం చదువుతున్న పెద్దవారు, గోవిందా గోవిందా అనే తెలుగు వారు, ఆండవనే అంటున్న తమిళులు, అభిషేకానికి తయారవుతున్న అభిషేకద్రవ్యాలు. నాకు దేవుడు కనపడడంలెదు అని ఆరాటపడె పిల్లలు, భర్తల క్షేమం కోసం భార్యలు, భార్యల సంతోషం కోసం భర్తలు, సెలవుల కోసం విద్యార్థులు. ఇలా ఎవరి బుల్లి బుల్లి కోరికలు వారివి. ఆడ మగా, చిన్నపెద్ద, ధనిక పేద అందరూ ప్రాంతాలు వేరైనా, భాషలు వేరైనా, పద్దతులు వేరైనా, అభిమతాలు వేరైనా మమేకమై స్వామిని కొలుస్తున్నారు… వారి భక్తిలో నిభత్తత, మనసులో ప్రశాంతత, కళ్లలో కరుణ, సాటి మనిషి పట్ల సద్భావము నాకు ఒకేలా కనుబడుతున్నాయి, వసుదైక కుటుంబాన్ని పోలుతున్నాయి. మనిషి తన అహాన్ని విడిచి, తను నిమిత్తమాత్రుడని గ్రహించి, తనకంటే అతీతమైన అనంతమైన శక్తి ముందు తనని తాను నివేదించుకున్న సందర్భం అది.
తెలుగు లో వైభోగం అని ఒక పదం ఉంది. ఆ సందర్భంలో జ్ఞప్తికి వచ్చింది. అడగకుండానే మనకు ఇంతటి వైభోగాన్ని ఇచ్చిన పూర్వికులకు మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? చరిత్ర మరచి, సంస్కారం విడిచి, కొన్ని యుగాలుగా మానవాళికి ఎంతొ వెలుగు పంచిన భరతీయ సంస్క్రుతిని అవహేళన చెయడంలొ ఆనందాన్ని వెతికే ఈ రొజుల్లొ, మన ఆచార సాంప్రదాయలకు ఇంత జీవాన్నిచ్చిన కెరళవారికి ఎమని కృతజ్ఞత చెప్పగలం? ఆ వైభోగం లో పాలుపంచుకోవడం, నలుగురికి ఈ పుణ్యవిశెషం గురించి చెప్పడం తప్ప. ఎన్నో సంధర్భాల్లొ ప్రపంచమే దిక్సూచిగా పరిగణించిన సంస్కృతి మనది. దానిని కాపాడకపొయినా పర్లేదు, కనీసం మనతరం వరకైనా పాడవకుండా చూద్దాం 🙏
Leave a reply